మహబూబ్ నగర్ జిల్లా పోలీసు

 జడ్చర్ల మండలం ఆలూరుకు చెందిన వృద్ధురాలు ఆశమ్మ. తనకున్న పని నిమిత్తం 03.08.2021 కలెక్టర్ కార్యాలయానికి వచ్చింది. తదుపరి అబ్దుల్ ఖాదర్ దర్గా వద్దకు వస్తూ అక్కడ తన సంచిని పోగొట్టుకున్నది. చుట్టుపక్కల వెతికి దొరకపోవడంతో, ఎటూ తోచకపోగా వృద్ధురాలికి పోలీసులు గుర్తుకొచ్చారు. సమీపంలోనే ఉన్న ఒన్ పోలీసు ఠాణాకు వెళ్ళి తన సంచిలో విలువైన పత్రాలు, డబ్బులు ఉన్నాయన్న విషయం చెప్పి బాధపడుతూ ఫిర్యాదు చేసింది. ఎస్.హెచ్.ఓ. రాజేశ్వర్ ఆదేశాల మేరకు, బ్లూ కోల్ట్స్ పోలీసు కానిస్టేబుళ్లు శ్రీశైలం, కేశవులు వెంటనే స్పందించారు. దర్గా దగ్గరకు వెళ్లి సమీపంలోని ప్రదేశాలను క్షుణ్ణంగా గమనించారు. వృద్ధురాలు చెప్పిన ఆనవాళ్లతో కూడిన ఒక సంచి ఆ దగ్గరలోనే వారికి దొరికింది. తదుపరి తమ అధికారి ఎస్.హెచ్.ఓ. కు విషయం తెలిపి, ముసలవ్వకు తమ చేతుల మీదుగానే సంచి అప్పగించారు. అందులో ఉండాల్సిన ఇరవై వేల రూపాయల నగదు, తన ఇంటి డాక్యుమెంట్లు, సెల్ ఫోన్, ఆధార్ కార్డు అన్నీ ఉన్నాయని ముసలవ్వ ఎంతగానో ఆనందపడింది. పోగొట్టుకున్న తన సొత్తు, విలువైన పత్రాలు తనకు అందించారని యువ పోలీసులకు చేతులెత్తి మొక్కబోతున్న వృద్ధురాలిని పోలీసు సిబ్బంది వారిస్తూ, అవ్వా... మీలాంటి పెద్దల ఆశీర్వాదం మాకు కావాలి... అంటూ యూనిఫామ్ లోని పోలీసులు ప్రేమగా అవ్వకు రెండు చేతులా ప్రేమగా నమస్కరించారు. ఇబ్బందుల్లో ఉన్నవారికి తక్షణం సాయం చేయడంలోనే కదా గొప్ప సంతృప్తి.