నెట్టెంపాడు ప్రాజెక్టు ద్వారా జోగులాంబ గద్వాల జిల్లాలోని చివరి ఆయకట్టు వరకు సాగునీరు
నెట్టెంపాడు ప్రాజెక్టు ద్వారా జోగులాంబ గద్వాల జిల్లాలోని చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని గద్వాల ఆర్డీవో రాములు ఒక ప్రకటనలో తెలిపారు. 2005 సంవత్సరంలో 101 ప్యాకేజీ కింద 2500 ఎకరాల భూసేకరణ జరిగిందని, బోయలగూడెం గ్రామ పరిధిలో 274 ఎకరాలకు రూ.2,25,91,444 లు, చాగదోన గ్రామ పరిధిలో 1150 ఎకరాలకు రూ.12,97,48,621 లు, హిందువాసి గ్రామ పరిధిలో 712 ఎకరాలకు రూ.5,59,66,229 లు, చిన్నోనిపల్లి గ్రామ ముంపుకు గురికాగా 251 ఇళ్లకు రూ.6,35,32,096 లు నష్టపరిహారం ఇప్పించడం జరిగిందన్నారు. ఇంతేకాక రైతులు నష్టపరిహారం సరిపోదని కోర్టుకు వెళ్లగా మళ్లీ రెండవసారి రూ.14,82,34,357 చెల్లించడం జరిగిందన్నారు. ముంపు గ్రామమైన చిన్నోని పల్లెలో 360 మందికి గాను 336 మందికి ఇళ్లపట్టాలు పంపిణీ చేయడం జరిగిందని, మిగతా 24 కూడా త్వరలో పంపిణీ చేస్తామన్నారు. ప్రస్తుతం ఆర్ఆర్ సెంటర్లో అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగిందని, గ్రామం వదిలి పునరావాస కేంద్రానికి వెళ్ళమని చెప్పగా వారు అభ్యంతరం చెబుతూ గ్రామం వదలడం లేదని ఆర్డీవో తెలిపారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం ద్వారా 101 ప్యాకేజీ క్రింద నిర్మించిన చిన్నోనిపల్లి రిజర్వాయర్ రైతులకు ఎలాంటి నష్టం లేదని తెలిపారు. చిన్నోనిపల్లి రిజర్వాయర్ కెపాసిటీ 1. 59 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించి 15 వేల ఎకరాలకు సాగునీరు అందించడానికి రూపొందించబడిందని తెలిపారు. రిజర్వాయర్ ద్వారా లాభాలను వివరిస్తూ విపత్కర పరిస్థితులలో చిన్నోనిపల్లి రిజర్వాయర్ ద్వారా నెట్టెంపాడు పరిధిలోని 3వేల ఎకరాల భూములకు, ఆర్డిఎస్ పరిధిలోని 12,500 భూములకు సాగునీరు అందించడానికి నిర్మించబడిందని తెలిపారు. అంతేగాక రిజర్వాయర్ పైన గల రైతులకు భూములకు పంపింగ్ ద్వారా నీరు సరఫరా చేసుకోవచ్చని తెలిపారు. పశువులు వేసవిలో త్రాగటానికి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ రిజర్వాయర్‌తో హిందూవాసి, బోయిలగూడెం గ్రామాల రైతులకు కూడా సాగునీరు లభిస్తుందని తెలిపారు. విపత్కర పరిస్థితులలో ఈ రిజర్వాయర్ నుండి నెట్టెంపాడు, ఆర్డీఎస్ కెనాల్ కు చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించవచ్చని ఆయన వివరించారు.నిర్వాసిత రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా తగు పరిహారం ఇవ్వడం జరిగిందని, పునరావాస కేంద్రాలలో కూడా పనులు చురుకుగా జరుగుతున్నాయని తెలిపారు. భవిష్యత్తు తరాల వారికి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మన ప్రాంతం అభివృద్ధి జరగాలంటే రైతుల సహకార ముండాలని ప్రభుత్వం తగు నష్టపరిహారం అందజేసి ఆదుకున్నదని ఆయన తెలిపారు. చిన్నోనిపల్లి రిజర్వాయర్ పనులు ఇప్పటికే 90 శాతం పూర్తి అయినందున మిగతా పది శాతం పనులు పూర్తి చేయడానికి రైతులు సహకరించాలని కోరడం జరిగిందన్నారు. ఆర్ అండ్ ఆర్ సెంటర్ లకు సంబంధించి పట్టాలా పంపిణి పూర్తి అయినది.. మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది.. గ్రామస్తులు షిఫ్ట్ కావాలి.. కావడం లేదు. గ్రామస్తులు సహకరిస్తే అభివృద్ధి మన కళ్ళముందే జరుగుతుందని ఆర్డీవో తెలిపారు.