వృత్తిలో నిబద్ధత కనపరిచినప్పుడు ఇంటాబయట గుర్తింపు
మనం చేసే వృత్తిలో నిబద్ధత కనపరిచినప్పుడు ఇంటాబయట గుర్తింపు లభించడమే గాకుండా అతి విలువైన ఆత్మసంతృప్తి లభిస్తుందని జిల్లా ఎస్.పి. శ్రీ ఆర్.వెంకటేశ్వర్లు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవల ప్రకటించిన పి.ఆర్.సి. వేతనాలను సకాలంలో పోలీసు శాఖకు అందించడంలో తోడ్పాటునందించిన జిల్లా ట్రెజరీ అధికారులతో పాటుగా పోలీసు కార్యాలయ సిబ్బందిని నేటి మంగళవారం (07.09.2021) ఉదయం ఎస్.పి. సత్కరించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఎస్.పి. శ్రీ ఆర్.వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ...నిత్యం పని ఒత్తిడితోనే సతమతమయ్యే
పోలీసు సిబ్బంది, తమ వేతనాలు, సర్వీసుకు సంబంధించిన విషయాలకై పోలీసు కార్యాలయం చుట్టూ తిరగడం తనకేమాత్రం ఇష్టం ఉండదని అన్నారు. సిబ్బందికి ఉన్న కొద్దిపాటి వెసులుబాటు సమయం ఇటువంటి సమస్యలకు కేటాయించవలసి రావడం వలన వారిని మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురి చేసినట్లే తాను భావిస్తానని పేర్కొన్నారు. ఈనేపథ్యంలోనే సిబ్బందికి సంబంధించిన సర్వీసు వివరాలను ఎప్పటికప్పుడు పూర్తి చేయడం వంటివి తన ప్రధాన బాధ్యతగా భావిస్తానని, నా ఆలోచన, అభిప్రాయానికి స్పందిస్తూ, తమ పోలీసు శాఖకు చెందిన పి.ఆర్.సి. వేతనాలను సకాలంలో అందించడంలో సహకరించిన డి.టి.ఓ. అధికారులకు ఎస్.పి. కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సందర్భంలో తమ పోలీసు కార్యాలయం సిబ్బంది కూడ నిర్విరామంగా చేసిన కృషి తనకు సంతోషం కలిగించిందని అన్నారు. మన వృత్తిపరమైన విజయాలు, ఇతరులకు సంతోషం కలిగించేవి అయినప్పుడు వాటి విశిష్టత మరింత పెరుగుతుందని, మంచిని అభినందించేందుకు తానెప్పుడూ సంసిద్ధంగా ఉంటానని ఈసందర్భంగా ఎస్.పి. వివరించారు. కార్యక్రమంలో డి.ఎస్.పి. శ్రీ జి.శ్రీధర్, ఏ.ఓ. శ్రీమతి లావణ్య, పోలీసు సంఘ అధ్యక్షుడు వెంకటయ్య మాట్లాడుతూ, సిబ్బంది సంక్షేమం కొరకై ఎస్.పి. తీసుకున్న ప్రత్యేక చొరవను వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎ.టి.ఓ. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ తమ విధులు తాము నిర్వర్తించామని, అయినా తమ డి.టి.ఓ. సిబ్బంది కష్టాన్ని గుర్తించి అభిమానంతో సత్కరించిన ఎస్.పి. గారి సహృదయతకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్లు సురేష్, శ్రీనివాస్, డి.పి.ఓ. సిబ్బంది నియామత్, సి.సి. రామిరెడ్డి, ట్రెజరీ శాఖ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.