ఇంటర్, పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి
ఇంటర్ ,పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి
ఎలాంటి పొరపాట్లకు తావివ్వవద్దు పరీక్షల సక్రమ నిర్వహణకు సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలి- జిల్లా కలెక్టర్ జి.రవినాయక్ ఆదేశం ఈనెల 15 నుండి ఏప్రిల్ 4 వరకు జిల్లాలో నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పబ్లిక్ పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్ ఆదేశించారు. బుధవారం అయన తన క్యాంపు కార్యాలయంలో ఇంటర్మీడియట్ ,పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ఏర్పాట్ల విషయమై సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇంటర్ పరీక్షలు మార్చి 15 నుండి ఏప్రిల్ 4 వరకు నిర్వహించడం జరుగుతున్నదని, ఇందుకుగాను జిల్లాలో 32 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం 10802 మంది విద్యార్థులు, రెండవ సంవత్సరం 9422 మంది విద్యార్థులు మొత్తం 20వేల 224 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. పదవ తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుండి 13వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని, ఇందుకుగాను జిల్లాలో 59 రెగ్యులర్ పరీక్ష కేంద్రాలు ,1 ప్రైవేట్ కేంద్రం మొత్తం 60 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. 12,561 మంది రెగ్యులర్ విద్యార్థులు, 268 మంది ప్రైవేట్ విద్యార్థులు, మొత్తం 12,829 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలకు హాజరుకానున్నట్లు కలెక్టర్ వెల్లడించారు .పదవ తరగతి పరీక్షలు ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.45 వరకు ఉంటాయని తెలిపారు.ఇంటర్, పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ,ఎలాంటి మాల్ ప్రాక్టీస్ జరగకుండా చూసుకోవాలని, ప్రభుత్వ ఆదేశాలను తూ.చా తప్పకుండా పాటించాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా పరీక్షల నిర్వహణలో ఇంటర్మీడియట్, పదవ తరగతి బోర్డు ఆదేశాల మేరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, విద్యార్థులు పరీక్షల ఒత్తిడిలో ఉంటారని ,అందువల్ల వారికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేయాలన్నారు. ఆర్టీసీ ద్వారా ఆదనపు బస్సులను నడపాలని ,సకాలంలో బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద ఏఎన్ఎం, మెడికల్ అధికారులతో పాటు పారామెడికల్ సిబ్బంది, అవసరమైన మందులతో ఫస్ట్ ఎయిడ్ ఏర్పాటు చేయాల్సిందిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కృష్ణను ఆదేశించారు. అన్ని పరీక్ష కేంద్రాలలో తాగునీరు, నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రశ్నాపత్రాలను స్పీడ్ పోస్టు ద్వారా పంపించేందుకు పోస్టల్ శాఖ చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షలు నిర్వహించే రోజులలో 144 సెక్షన్ విధించడంతోపాటు, జిరాక్స్ కేంద్రాలు మూసి ఉంచేలా ఉత్తర్వులు జారీ చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. పోలీస్ శాఖ తరపున అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాల్సిందిగా పోలీసు అధికారులతో కోరారు. ఇంటర్ పరీక్షలతో పాటు, పదో తరగతి పరీక్షలకు ఫ్లైయింగ్ స్క్వాడ్ సిట్టింగ్ స్క్వాడ్ లను ఏర్పాటు చేయడం జరుగుతుందని, దీంతోపాటు జిల్లా, మండల స్థాయి అధికారులను ప్రత్యేకంగా ప్రతి కేంద్రానికి ఒకరి చొప్పున నియమించడం జరుగుతుందని, వీరు సంబంధిత పరీక్ష కేంద్రంలోనే ఉంటారని కలెక్టర్ పేర్కొన్నారు.జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, డీఈవో యాదయ్య, సంబంధిత శాఖల జిల్లా అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.