ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు-జిల్లా కలెక్టర్ ఎస్ .వెంకటరావు
ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు-జిల్లా కలెక్టర్ ఎస్ .వెంకటరావు.కోవిడ్ నిబంధనలు పక్కాగా పాటిస్తూ ఈ సంవత్సరపు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు జిల్లా అధికారులను ఆదేశించారు.స్వతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్ల పై గురువారం ఆయన రెవెన్యూ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్షించారు . స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారని తెలిపారు. ఈ వేడుకలలో భాగంగా ఆయా శాఖల అధికారులు వారి శాఖల అభివృద్ధిని తెలియజేసే విధంగా శకటాలు,స్టాల్స్ ఏర్పాటు చేయాలని , ఈ శకటాలు పట్టణంలోని ప్రజలందరూ తిలకించేలా పట్టణంలో తిప్పాలని వేడుకల సందర్బంగా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ తో కోరారు. పాఠశాల విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ, జిల్లా పౌరసంబంధాల అధికార్లను ఆదేశించారు.ఈ సంవత్సరం ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాల పంపిణీలో భాగంగా ఒక శాఖ నుండి కేవలం ఒకరికి మాత్రమే ప్రశంసా పత్రాలు అందజేయనున్నట్టు కలెక్టర్ వెల్లడించారు. కార్యక్రమాల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.జిల్లా ఎస్ పి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్బంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తామని, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే విద్యార్థులకు, తల్లిదండ్రులకు, సాధారణ పౌరులకు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించేలా వైద్య ,ఆరోగ్య శాఖ అధికారులు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు. అంతే కాక ఆయా శాఖల అధికారులు కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు.డి ఆర్ ఓ కె. స్వర్ణలత, మిషన్ భగీరథ ఎస్ ఈ. వెంకటరమణ, జిల్లా అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.