26 నుండి ఆగస్టు 2 వరకు "నాన్ లోని ఫార్మర్స్ వారోత్సవం"
ఈ నెల 26 నుండి ఆగస్టు 2 వరకు "నాన్ లోని ఫార్మర్స్ వారోత్సవం" నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు బ్యాంక్ అధికారులతో కోరారు .
ఈ విషయమై సోమవారం అయన బ్యాంకుల నియంత్రణ అధికారులు, వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
వార్షిక రుణ ప్రణాళికలో నిర్దేశించిన ప్రకారం బ్యాంకులు రైతులకు ఈ వాన కాలంలో పంట రుణాలు ఇవ్వాలని చెప్పారు. రైతుల గురించి, వారి పొలాల గురించిన వివరాలను బ్యాంకర్లు ధరణి పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చని అన్నారు.
జిల్లాలో ఈ సంవత్సరం సాధారణ వర్షపాతం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైందని, రైతులందరూ పంటలు సాగు చేస్తున్నారని,గతం కన్నా సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని అందువల్ల రైతులు రుణాలు పొందేందుకు ఇదే మంచి సమయం అని అన్నారు. బ్యాంకర్లు పంట రుణాలు ఇవ్వక పోతే రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించే ప్రమాదం ఉందని ,అందువల్ల వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల బారిన పడకుండా బ్యాంకు అధికారులు రైతులకు పంట రుణాలు ఇవ్వాలని కోరారు. వారం రోజుల పాటు నిర్వహించే "నాన్ లోనీ ఫార్మర్ వారోత్సవం" విషయమై అన్ని బ్యాంకులు, వ్యవసాయ శాఖ కార్యాలయాల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ విషయంలో బ్యాంకర్లకు జిల్లా యంత్రాంగం తరఫున అవసరమైన సహకారం అందిస్తామని కలెక్టర్ వెల్లడించారు. వారం రోజుల పాటు పండగ వాతావరణంలో అన్ని బ్యాంకులలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని, ముఖ్యంగా కోవిడ్ నిబంధనలు పాటించాలని, అవసరమైనన్ని మాస్కులు,సానిటైజర్లు ఏర్పాటు చేయాలని, ఒకవేళ ఎక్కడైనా రద్దీ ఎక్కువ ఉన్నట్లయితే పోలీసుల సహకారం కూడా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఎల్ డి ఎం నాగరాజు, జిల్లా వ్యవసాయ అధికారిని సుచరిత, ఎస్బిఐ ఏజీఎం దినేష్ గురునాథ్ ,ఏపీజీవీబీ ఏజీఎం మనోజ్ కుమార్ ,యు బి ఐ డిప్యూటీ జి ఎం రమణ, ఇండియన్ బ్యాంక్ సీనియర్ మేనేజర్ షణ్ముఖం, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.