డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: భారీ విద్యార్థి ర్యాలీ
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: భారీ విద్యార్థి ర్యాలీ
మహబూబ్నగర్ (ఆర్కే న్యూస్ ప్రతినిధి) మార్చి 30:
యువత మాదకద్రవ్యాల వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండి, ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని మహబూబ్నగర్ డీఎస్పీ బాలాజీ పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి ఆదేశాల మేరకు, తెలంగాణ ఈగల్ ఫోర్స్ సహకారంతో టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం మాదకద్రవ్యాల నిర్మూలనపై భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
యువతను చిదిమేస్తున్న మహమ్మారి
స్థానిక అంబేద్కర్ కళాభవన్లో టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఎజాజుద్దీన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో డీఎస్పీ బాలాజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియోగం వల్ల శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలే కాకుండా, విద్యలో వెనుకబాటు, కుటుంబాల్లో తీవ్ర విషాదం నిండుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు అప్రమత్తంగా ఉండి, డ్రగ్స్ లేని సమాజ స్థాపనకు కృషి చేయాలని కోరారు.
హోరెత్తిన తెలంగాణ కూడలి
అనంతరం సుమారు 1000 మంది విద్యార్థులతో అంబేద్కర్ కళాభవన్ నుండి తెలంగాణ కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో తెలంగాణ ఈగల్ ఫోర్స్ అదనపు ఎస్పీ శ్రీ కృష్ణమూర్తి పాల్గొని విద్యార్థులను ఉత్సాహపరిచారు.
