ఎమ్మెల్యే అల కు దమ్ము ధైర్యం ఉందా... కొండా ప్రశాంత్ రెడ్డి డిమాండ్

 దేవరకద్ర నియోజకవర్గ అభివృద్ధి పై ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి శ్వేత పత్రం విడుదల చేయాలని పిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ కొండా ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రశాంత్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కాంగ్రెస్ పార్టీ తరఫున న్యాయ పోరాటం చేస్తూ నిరాహార దీక్షలు చేస్తే ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అసహనానికి లోనై కాంగ్రెస్ పార్టీ నాయకులను దూషించడం కరెక్ట్ కాదని హెచ్చరించారు. ఎమ్మెల్యేకు దమ్ము ధైర్యం ఉంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏ ఒకటైన నియోజకవర్గంలో ప్రజలకు అందించారా అని ప్రశ్నించారు. మాట్లాడితే చాలు రైతుబంధు, ఆసరా పెన్షన్ పేరుతో రైతులను, ప్రజలను మభ్యపెడుతూ ఊకదంపుడు ఉపన్యాసాలు చేయడం తప్ప చేసిందేమీ లేదు అంటూ ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలో చెక్ డ్యాం ల పేరుతో ఇసుక దోపిడీకి పాల్పడుతూ, ప్రాజెక్టుల పేరుతో మట్టిని కూడ తరలించి సొమ్ము చేసుకొని కరివేన ముంపు బాధితులకు ఇచ్చిన హామీలు మర్చిపోయారని ధ్వజమెత్తారు. నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రి నిర్మిస్తానని చెప్పిన మాటలు నీటిమూటలుగా మారాయని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి,ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై బహిరంగ చర్చకు ఎమ్మెల్యే సిద్ధం కావాలని పేర్కొన్నారు.అదేవిధంగా నియోజకవర్గ కేంద్రంలో తన వెంట తిరిగే తెరాస నాయకుల అరాచకాలు ఎక్కువయ్యాయని, అలాంటి వారికి స్వయంగా ఎమ్మెల్యే మద్దతుగా నిలిచి అధికారులను బెదిరింపులకు గురి చేసి తప్పుడు పత్రాలతో ఎంపీపీ ని చేసింది నిజం కాదా అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు లక్ష్మణ్ యాదవ్, రాములు, శ్రీనివాసులు, రాఘవేందర్ రెడ్డి, ఆంజనేయులు, వీరారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.