అరబిందో ఫార్మసీ ఎల్ అండ్ టీ కంపెనీలను సందర్శించిన జిల్లా ఎస్.పి.ఆర్.వెంకటేశ్వర్లు

 మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పి.ఎస్. పరిధిలోని పోలేపల్లి సెజ్ లో ఉన్న అరబిందో ఫార్మసీ, ఎల్ అండ్ టీ కంపెనీలను ఈరోజు సాయంత్రం జిల్లా ఎస్.పి. శ్రీ ఆర్.వెంకటేశ్వర్లు  సందర్శించారు. 

గత రెండు మూడు రోజులుగా సెజ్ లో పని చేస్తున్న ఉద్యోగులలో కొందరికి కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో, ఆయా కంపెనీలలో తీసుకుంటున్న జాగ్రత్తలను పరిశీలించారు. ఈసందర్భంగా ఎస్.పి. సంబంధిత కంపెనీల అధికారులతో మాట్లాడుతూ, కోవిడ్ నిబంధనలు పాటించడంలో పూర్తిస్థాయి శ్రద్ధ వహించాలని, వందలాది మంది ఉద్యోగులు ఉండే కంపెనీలలో ఏమాత్రం అశ్రద్ధ జరిగినా పరిస్థితులు చేయి దాటిపోతాయని తెలిపారు. ప్రతిరోజూ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ఉద్యోగుల రాకపోకలు జరుగుతుంటాయని, ఈ నేపథ్యంలో సెజ్ లో కోవిడ్ నిబంధనలు, జాగ్రత్తలు, అవగాహన కల్పించడంతో పాటుగా, కోవిడ్ వలన జరిగే అనారోగ్య, ఆర్ధికపరమైన నష్టాల గురించి నిత్యం చెప్తుండాలని సూచించారు. ప్రభుత్వం, వైద్యుల చెప్పిన కోవిడ్ నిబంధనలు, జాగ్రత్తలు ప్రతిఒక్కరూ పాటించేలా చర్యలు తీసుకోవాలని, కరోనా విపత్తును నిర్మూలించే దిశలో ప్రతిఒక్కరూ తమవంతు బాధ్యత, భాగస్వామ్యం తీసుకోవాలని ఈసందర్భంగా ఎస్.పి. తెలిపారు. కరోనా నివారణకు తాము తీసుకుంటున్న జాగ్రత్తలను సంబంధిత కంపెనీల అధికారులు తెలియజేస్తూ, మున్ముందు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామని ఎస్.పి.  తెలిపారు.
ఎస్.పి. గారి వెన్నంటి జడ్చర్ల ఎస్.హెచ్.ఓ. వీరస్వామి, రూరల్ ఇన్స్పెక్టర్ జమ్ములప్ప ఇతర అధికారులు ఉన్నారు.