DEO ఆదేశాలకే దిక్కులేదా?
అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట: 120 రోజులుగా 'వేముల' నియామకాల్లో వీడని చిక్కుముడి!
మెరిట్ లిస్ట్‌ను దాచడం వెనుక అంతర్యమేమిటి?
DEO ఆదేశాలకే దిక్కులేదా? బాధితురాలు బి. ప్రవళిక పోరాటం.. ఇప్పుడు కేంద్రం దృష్టికి!
మిడ్జిల్/మహబూబ్ నగర్ (ఆర్కే న్యూస్ ప్రతినిధి):
ప్రభుత్వ నియామకాల్లో పారదర్శకత అనేది కేవలం కాగితాలకే పరిమితమైందా? చట్టాలు సామాన్యులకు సమాచారం అందించడంలో విఫలమవుతున్నాయా? అంటే మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం వేముల గ్రామంలోని ప్రీ-ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ నియామక ప్రక్రియను చూస్తే 'అవును' అనే సమాధానం వినిపిస్తోంది. ఒక అభ్యర్థి తన మెరిట్ వివరాల కోసం చేస్తున్న 120 రోజుల సుదీర్ఘ పోరాటం, విద్యాశాఖలోని లొసుగులను ఎత్తిచూపుతోంది.
చట్టాన్ని చుట్టేస్తున్న క్షేత్రస్థాయి అధికారులు:
గత నవంబర్ 24, 2025న బాధితురాలు బి. ప్రవళిక RTI (సమాచార హక్కు చట్టం) ద్వారా మెరిట్ వివరాలు కోరారు. చట్టం ప్రకారం 30 రోజుల్లో సమాచారం ఇవ్వాల్సి ఉండగా, 120 రోజులు గడిచినా అధికారులు 'మౌన వ్రతం' పాటించడం వెనుక అసలు కారణమేమిటి? అర్హులైన అభ్యర్థులను పక్కన పెట్టి, అపారదర్శకంగా నియామకాలు చేపట్టారా? అన్న అనుమానాలు ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
DEO ఆదేశాలూ బేఖాతరు!
ఈ వ్యవహారంలో జిల్లా విద్యాశాఖాధికారి (DEO) గారు డిసెంబర్ 8న (Lr. No. TSS/PV/0005/2025) విచారణకు ఆదేశించినా, క్షేత్రస్థాయిలో ఆ ఆదేశాలు అమలుకు నోచుకోకపోవడం గమనార్హం. ఉన్నతాధికారుల ఉత్తర్వులనే బేఖాతరు చేస్తున్నారంటే, ఈ నియామకాల్లో ఎంతటి అదృశ్య శక్తుల హస్తం ఉందో అర్థం చేసుకోవచ్చు. తప్పుడు నివేదికలతో ఉన్నతాధికారులను సైతం తప్పుదోవ పట్టిస్తున్నారని బాధితురాలు ఆరోపిస్తున్నారు.
ఢిల్లీ దాకా చేరిన ఫిర్యాదు:
స్థానిక అధికారుల నుండి న్యాయం లభించకపోవడంతో, బాధితురాలు వెనక్కి తగ్గకుండా పోరాటాన్ని ఉధృతం చేశారు. ఏకంగా కేంద్ర ప్రభుత్వ ప్రజా ఫిర్యాదుల పోర్టల్ (CGRM - No: DOSEL/E/A/26/0000395) మరియు తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ (TGIC - No: 2026000356) కు ఫిర్యాదు చేశారు.
"అర్హత ఉన్నా మెరిట్ జాబితాను ఎందుకు దాస్తున్నారు? పారదర్శకంగా జరగాల్సిన నియామకాల్లో గోప్యత ఎందుకు?" అని బాధితురాలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, అర్హులైన వారికి న్యాయం చేయాలని వేముల గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.