బిజెపితోనే దేశానికి ప్రమాదం..!సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

బిజెపితోనే దేశానికి ప్రమాదం..! 
 
 సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు 
 
 షాద్ నగర్ లో మీడియాతో సీపీఐ 
 
 బిజెపి వ్యతిరేక శక్తులు ఏకం కావాలని పిలుపు 
 
 సిబిఐ, ఈడి లాంటి దర్యాప్తు సంస్థలతో ప్రతిపక్షాలు, విపక్షాలకు బెదిరింపులు 
 
 కవిత, సిసోడియా లాంటి వారిపై వేదింపులు 
 
 బీఆర్ఎస్ కు పార్టీకి మద్దతిస్తామని స్పష్టీకరణ 
 
 వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కలసి పోటీ చేస్తామని స్పష్టం 
 
 వచ్చే ఎన్నికల్లో బండి సంజయ్, అరవింద్ లు ఓడిపోతారని జోస్యం 
 
 దేశ సమగ్రత, సార్వభౌమాధికారం, ఆర్థిక స్వాలంబనకు డోకా ఏర్పడిందని ప్రస్తుతం రాజ్యాంగమే ప్రమాదంలో పడిందని దీనికంతటికి కారణం భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ విధివిధానాలేనని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. 

గురువారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని కేకేఆర్ కన్వెన్షన్లో జరిగిన భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం మనుస్మృతిపై సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో పాటు ఉస్మానియా ప్రొఫెసర్ ఖాసిం హాజరయ్యారు. సెమినార్ అధ్యక్షులు, సిపిఐ సీనియర్ నేత పానుగంటి పర్వతాలు అధ్యక్షతన జరిగిన సెమినార్ కార్యక్రమానికి ముందు కూనంనేని సాంబశివరావు మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగాన్ని పక్కనపెట్టి మనువాదాన్ని కేంద్ర ప్రభుత్వం తెరపైకి తెస్తోందని అన్నారు. రాజ్యాంగాన్ని విచ్చలవిడిగా బ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. దేశ సమగ్రతకు సమైక్యతకు విఘాతం కల్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో బిజెపి విస్తరిస్తే ప్రమాదం పొంచి ఉందని అన్నారు. బిజెపి వ్యతిరేక శక్తులు ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అందుకే తాము గత అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ రాష్ట్ర సమితి పార్టీకి మద్దతు తెలిపినట్టు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ లాంటి పార్టీలు బలపడాలని బలంగా కోరుకుంటున్నట్టు చెప్పారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను తమ గుప్పిట్లో పెట్టుకొని విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్సీ కవిత, సిసోడియా లాంటి వారిపై చట్టం తన పని తాను చేయకుండా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటుందని అన్నారు. తప్పు చేస్తే ఎవరినైనా శిక్షించాలి కానీ కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలలో వేలు పెట్టడం మంచిది కాదన్నారు. బెదిరించి రాష్ట్ర ప్రభుత్వాలను లొంగదీసుకోవాలనుకోవడం మూర్ఖత్వం అవుతుందన్నారు. దేశ వ్యాప్తంగా బిజెపి ఎంపీలు 58 మంది, అదేవిధంగా 170 మంది ఎమ్మెల్యేలు అవినీతి అక్రమాల్లో కూరుకుపోయారని  ఇవి కేంద్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా అనీ ధ్వజమెత్తారు. ఎంతో మంది ఆర్థికంగా 150 లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొడితే వారిని పట్టించుకున్న పాపాన పోలేదని కేంద్రంపై విరుచుకుపడ్డారు.  అవినీతి చేసిన వారు బిజెపి లో ఉంటే పునీతులు అవుతారని, లేకపోతే పాపాత్ములు అవుతారనే చందంగా బిజెపి వ్యవహరిస్తుందని అన్నారు. తొమ్మిది రాష్ట్రాల్లో అన్యాయంగా ప్రభుత్వాలను అక్రమ దారిలో బిజెపి కూలగొట్టిందని అన్నారు. భవిష్యత్తులో కేంద్రం పెద్దలు అనుభవించాల్సి ఉంటుందని, మోడీ కూడా జైలు ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ రాజ్యాంగ వ్యవస్థను నాశనం చేస్తున్న బిజెపి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. తొమ్మిదేళ్లలో గాలి జనార్ధన్ రెడ్డి, ఎడ్డురప్ప లాంటివారు ఎందరో ఆర్థిక సంపదలు కొల్లగొట్టారని అన్నారు. వీరిని ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బండి సంజయ్ అరవింద్ ఓడిపోతారని ఒక్క లోక్ సభ స్థానం కూడా బిజెపికి దక్కదని జోస్యం చెప్పారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితితో పొత్తు ఉంటుందని స్పష్టం చేశారు. సిపిఐ అనేక స్థానాల్లో ఉమ్మడిగా పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెడతామని, బిజెపిని ఎదురిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సెమినార్ అధ్యక్షుడు పానుగంటి పర్వతాలు, పాలమాకుల జంగయ్య, రవీంద్ర చారి, పుస్తకాల నర్సింగ్ రావు, బుద్ధుల జంగయ్య, శ్రీను నాయక్, పవన్, గోవింద్, షకీల్, జంగయ్య, చంద్రయ్య, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.