మద్యం దుకాణాల్లో వచ్చే ఏడాది నుంచి గౌడ కులస్థులకు 15 శాతం
మద్యం దుకాణాల్లో వచ్చే ఏడాది నుంచి గౌడ కులస్థులకు 15 శాతం కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు ఎక్సైజ్ శాఖా మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ గౌడులు సిఎం కెసిఆర్ కు రుణపడి వుంటారని అన్నారు. ఈ సందర్భంగా సిఎం ను శాలువాతో సత్కరించాలని ఆశించిన మంత్రికి ప్రతిగా సిఎం కెసిఆర్ శాలువా కప్పినారు. ‘‘కల్లుగీత వృత్తి గౌడకులం లో పుట్టిన బిడ్డవు.. నీకే నీను సన్మానం చేయాలె’’ అంటూ శ్రీనివాస్ గౌడ్ ను సిఎం కెసిఆర్ అభినందించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ... ఈ దేశంలో కుల వృత్తులను ప్రోత్సహించడం సిఎం కేసిఆర్ కు మాత్రమే సాధ్యమని అన్నారు. ఇప్పటికే నీరా అమ్మకాలను కేవలం గౌడ కులస్థులకు మాత్రమే కేటాయించి చారిత్రక నిర్ణయం తీసుకున్న సిఎం కెసిఆర్, మద్యం దుకాణాల్లో గౌడులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం ఎస్టీలకు 5 శాతం ర రిజర్వేషన్లు కలిపించి మరో చారిత్రక నిర్ణయానికి శ్రీకారం చుట్టారన్నారు,. వ్యాపారాల్లో రిజర్వేషన్ కల్పిస్తూ దళిత బహుజనులకు ఆత్మగౌరవాన్ని ఎత్తిపడుతూ నాటి సర్వాయి పాపన్న ఆశయాలను సిఎం కెసిఆర్ తీర్చుతున్నాడని కొనియాడారు.