త్వరలోనే భారత్ మాల నోటిఫికేషన్-- జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్ రావు

భారత్ మాల కార్యక్రమం కింద  జడ్చర్ల  నుండి  దేవ సూగురు వరకు చేపట్టనున్న 167 వ  జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించి అతి త్వరలోనే నోటిఫికేషన్ ను జారీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు .

       ఈ విషయమై అదనపు కలెక్టర్ సీతారామారావు ,సర్వే మరియు జాతీయ రహదారుల సంస్థ  అధికారులు  స్థలాన్ని చూడటం జరిగిందని ఆయన చెప్పారు. రైతుల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని  రోడ్డు విస్తరణ ను  గతం కన్నా పది మీటర్లు తగ్గించడం జరిగిందని కలెక్టర్ వెల్లడించారు. జాతీయ రహదారి భూ సేకరణ అధీకృత అధికారిగా ఇదివరకు జాయింట్ కలెక్టర్ ఉండేవారని అయితే ప్రభుత్వం జాయింట్ కలెక్టర్ పేరును అదనపు కలెక్టర్ గా మార్చినందున  అదనపు కలెక్టర్ పేరు పై గజిట్ వచ్చిన తర్వాత అదనపు కలెక్టర్ పేరుపైన నోటిఫికేషన్ ఇవ్వవలసి ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు. సాంకేతిక కారణాల వల్ల రోడ్డు నిర్మాణ పనులు ఆలస్యం అయినట్లు కలెక్టర్ వెల్లడించారు .ఏదిఏమైనప్పటికీ అతిత్వరలోనే భారత్ మాల జాతీయ రహదారి పనులకు సంబంధించి నోటిఫికేషన్  విడుదల చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు.
       కాగా శనివారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ కే. సీతారామారావు, సర్వే ల్యాండ్ రికార్డ్స్ సహాయ సంచాలకులు శ్యామ్ సుందర్ రెడ్డి , డి పి ఆర్ ఓ యు.వెంకటేశ్వర్లు,మహబూబ్నగర్ అర్బన్ తాసిల్దార్ పార్థసారథి ,సర్వేయర్ రంగయ్య, జాతీయ రహదారుల సంస్థ భూ సేకరణ కన్సల్టెంట్ సమజ, సైట్ ఇంజనీరు శరత్, జాతీయ రహదారుల ప్రాజెక్టు మేనేజర్ మదన్ తదితరులు జడ్చర్ల వద్ద భారత్ మాల జాతీయ రహదారి భూమిని చూశారు.