మహబూబ్ నగర్ జిల్లా మహిళ స్వయం సహాయక సంఘాలు
మహబూబ్ నగర్ జిల్లా మహిళ స్వయం సహాయక సంఘాలు తయారుచేసిన ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకు వచ్చేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్
ఎస్. వెంకట రావు ఒక ప్రకటనలో తెలిపారు .
ఇందుకుగాను "మహా" బ్రాండ్ పేరుతో జిల్లాతో పాటు, ఇతర ప్రాంతాలలో ఉత్పత్తులను అమ్మేలా ఆన్లైన్ నమ్మకాలను కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు. దీంతోపాటు మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారుచేసిన ఉత్పత్తుల ప్రదర్శన అమ్మకాలను మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో తరచుగా ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు.
ఇందులో భాగంగానే ఈ నెల 2వ తేదీ నుండి 5 వరకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయ ఆవరణలో, అంబేద్కర్ చౌరస్తా వద్ద ఉన్న ఎక్స్ పో ప్లాజాలో నాలుగు రోజుల పాటు "పాలమూరు జిల్లా స్వయం సహాయక సంఘాలు తయారుచేసిన ఉత్పత్తుల అమ్మకాలు, ప్రదర్శన" ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ ప్రదర్శనను ఈ నెల 2 న రాష్ట్ర ఎక్సైజ్ ,క్రీడలు, సాంస్కృతిక ,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ప్రారంభిస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రదర్శనలో డి ఆర్ డి ఎ మహిళలు తయారుచేసిన 70 రకాల ఉత్పత్తులు అలాగే చేనేత కార్మికులు తయారుచేసిన ఉత్పత్తుల ప్రదర్శన కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు .మహబూబ్నగర్ జిల్లా మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు పేపర్ బొకేలు, ఫ్లవర్ వాజులు, కానుగ నూనె ,రెడీమేడ్ దుస్తులు వంటి 70 రకాల ఉత్పత్తులను తయారు చేస్తున్నారని, వీటన్నింటిని మహా బ్రాండ్ పేరుమీద అమ్మకాలు కొనసాగిస్తున్నామని ఆయన తెలిపారు.మహా ఉత్పత్తులప్రదర్శన లతోపాటు ఆన్లైన్లో కూడా జిల్లా వాసులతో పాటు జాతీయ ,అంతర్జాతీయ స్థాయిలో ఎవరైనా కొనుగోలు చేసేలా ఉత్పత్తులను ఆన్లైన్లో ఉంచడం జరిగిందని ఆయన వెల్లడించారు .ఈ ప్రదర్శనలో భాగంగా నారాయణపేట కాటన్ చీరలు, గద్వాల పట్టు చీరలు, పోచంపల్లి చీరలు ,డ్రెస్ మెటీరియల్ ఈ ప్రదర్శనలో వినియోగదారులు కొనుగోలు చేయవచ్చని ఆయన వెల్లడించారు. మహిళా సంఘాలు తయారుచేసిన ఉత్పత్తులకు మంచి ధర కల్పించడంతోపాటు, ఆన్లైన్ ద్వారా వారి ఉత్పత్తులకు మంచి పేరు,ప్రఖ్యాతులను తీసుకువచ్చి జిల్లాలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు మేలు కల్పించటమే తమ ధ్యేయమని ఆయన తెలిపారు. అదేవిధంగా చేనేత కార్మికులు నేసిన బట్టలు ఉత్పత్తి ధరలకే అమ్మటం జరుగుతుందని, దీనివల్ల చేనేత సంఘాలు బలోపేతం చేయటం ద్వారా కార్మికులందరికీ ఉపాధి దొరుకుతుందని తెలిపారు.చేనేత వస్త్రాలు ధరించడం వల్ల ఎలాంటి రుగ్మతలు రావని, చేనేత వస్త్రాలు చలికాలంలో వెచ్చగాను, వేసవి కాలంలో చల్లగా ఉండి అందరికీ అనుకూలంగా ఉంటాయని ఆయన వెల్లడించారు .జిల్లా ప్రజలు, ఉమ్మడి జిల్లా ప్రజలు నాలుగు రోజులపాటు నిర్వహించే పాలమూరు స్వయం సహాయక మహిళా సంఘాలు ఉత్పత్తి చేసిన ఉత్పత్తుల ప్రదర్శన సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.