రైతు వేదికల నిర్మాణాలలో నాణ్యత పాటించాలి...కలెక్టర్ ఎస్. వెంకట రావు
రైతు వేదికల నిర్మాణాలలో నాణ్యత లోపించకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు అన్నారు. జిల్లాలో నిర్మిస్తున్న రైతు వేదికల నిర్మాణాలను వేగవంతం చేసి ఈ నెలాఖరు నాటికి రైతు వేదికలకు ఒక రూపు తీసుకురావాలని ఆయన ఆదేశించారు.రైతు వేదికల నిర్మాణాల విషయమై శనివారం ఆయన ఇంజనీరింగ్ అధికారులు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు, వ్యవసాయ అధికారులు, ప్రత్యేక అధికారులతో వెబ్ ఎక్స్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర రెడ్డి కూడా హాజరైన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ రైతు వేదికల నిర్మాణాలపై అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో నే రైతుల కోసం రైతు వేదికలను నిర్మించడం జరుగుతున్న విషయాన్ని అధికారులు దృష్టిలో ఉంచుకోవాలన్నారు. రైతు వేదికల నిర్మాణం జాప్యం కాకుండా ఉండేందుకు గాను ముందుగానే నిధులు కేటాయించడమీ కాకుండా, ఇసుక సమస్య లేకుండా ముందే ఇసుకను కూడా అడ్వాన్స్ గా ఇవ్వడం జరిగిందని అన్నారు .రైతు వేదికల ప్రత్యేక అధికారులు రైతు వేదికలపై ప్రతిరోజు గంట, రెండు గంటలు కేటాయించాలని ఆయన కోరారు .రాష్ట్ర ప్రభుత్వం సూచించిన కొలతలు,నియమాల ప్రకారమే రైతు వేదికలను నిర్మించాలని, ఒకవేళ నియమ నిబంధనలు ఉల్లంఘించి ఎక్కడైనా నిర్మాణలు చేపడితే సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లపై చర్యలు తీసుకుంటామని అన్నారు. నిర్మాణాలలో ఏలాంటి నాణ్యత లోపించకూడదని, నాణ్యత పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ఆయన ఆదేశించారు. రైతు వేదికల నిర్మాణాలు నాణ్యతగా ఉండేందుకు నాణ్యత ప్రమాణాలు పరీక్షించేందుకు థర్డ్ పార్టీని నియమించడం జరుగుతున్నదని తెలిపారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు రైతు వేదికల నాణ్యతను పూర్తిగా పరిశీలించి తృప్తి చెందిన మీదటే ఏజెన్సీలకు బిల్లులు చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. తాసిల్దార్ లు, ఎంపీడీవోలు ,వ్యవసాయ అధికారులు ఒకేసారి 2,3 రైతు వేదికలను ప్రత్యక్షంగా తిరిగి పరిశీలించి ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే గుర్తించి వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో నిర్మిస్తున్న రైతు వేదికలకు 10 రోజుల్లో విద్యుత్ కనెక్షన్లు ఇచ్చే విషయంపై కూడా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు. నిర్మాణాలను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆయన కోరారు.దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ రైతు వేదికల నిర్మాణాలపై సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలు ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తే నాణ్యతతో పాటు త్వరితగతిన రైతు వేదికలు పూర్తవుతాయని అన్నారు.తన నియోజకవర్గంలో చేపట్టిన రైతు వేదికలకు మంచి పెయింటింగ్ వేయిస్తే అందుకు అవసరమైతే తన సొంత నిధులను చేస్తానని ఈ సందర్భంగా శాసనసభ్యులు కలెక్టర్ కు తెలిపారు. ఇందుకు స్పందించిన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ముందుగా రైతు వేదిక నిర్మించిన వారికి నగదు బహుమతిని కూడా ఇస్తామని ఇదివరకే ప్రకటించడం జరిగిందని ,ఆ మొత్తాన్ని ఆ క్లస్టర్ లో అభివృద్ధి కార్యక్రమాలకు వాడుకోవచ్చని కూడా తెలిపినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దేవరకద్ర, అడ్డాకుల, జడ్చర్ల, మూసాపేట ,చిన్నచింతకుంట ,తదితర అన్నిమండలాల వారీగా రైతు వేదికల నిర్మాణాలను సమీక్షించారు. నిర్మాణాలలో పురోగతి తక్కువగా ఉన్న చోట వేగం పెంచాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దేవరకద్ర నియోజకవర్గంలో చేపట్టిన నిర్మాణాల ను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు తనతో పాటు శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర రెడ్డితో పాటు త్వరలోనే మండలాలలో పర్యటిస్తానని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెల్లడించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు పంచాయతీ రాజ్, మిషన్ భగీరథ, ఆర్ అండ్ బి ఇంజనీరింగ్ అధికారులు, తహసిల్దార్లు, ఎంపిడిఓలు, వ్యవసాయ అధికారులు,మండల వ్యవసాయ అధికారులు,ఇతర సంబందిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.