త్వరలోనే "మహా" ఉత్పత్తులతో "మహా" ప్రదర్శన
త్వరలోనే "మహా" ఉత్పత్తులతో "మహా" ప్రదర్శన.
జిల్లా వ్యాప్తంగా 5 మహా స్టోర్ల ప్రారంభం.
"మహా "ఉత్పత్తుల ద్వారా జిల్లాకు మంచిపేరు తీసుకురండి -జిల్లా కలెక్టర్ ఎస్ .వెంకట రావు పిలుపు
2 కోట్ల విత్తన బంతుల ద్వారా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించినట్లు గానే "మహా "ఉత్పత్తుల ద్వారా కూడా జిల్లా మరో రికార్డు సృష్టించాలని జిల్లా కలెక్టర్ అన్నారు .
మంగళవారం మహబూబ్ నగర్ ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో "మహా" ఉత్పత్తుల పై నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
జిల్లాలోని మూసాపేట, దేవరకద్ర జడ్చర్ల, భూత్పూర్, మహబూబ్ నగర్ టౌన్ లో "మహా" సూపర్ మార్కెట్ లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ చెప్పారు. ఆగస్టు 15 న మహా ఉత్పత్తులతో ఒక పెద్ద ఎగ్జిబిషన్ నిర్వహించాలని, ప్రతి మండలం నుండి మహిళా సంఘాలు తయారు చేసిన 5 నుంచి 10 ఉత్పత్తులు ఈ ప్రదర్శనకు తీసుకురావాలని చెప్పారు.
ముఖ్యంగా చేతివృత్తుల తో తయారుచేసిన వస్తువులు,చేనేత, జువెలరీ తదితర ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచాలని సూచించారు.
ఇక పై "మహా" ఉత్పత్తులను పెంచటం, నాణ్యత, ఆన్లైన్ బిజినెస్ పై దృష్టిసారించాలని చెప్పారు. "మహా" ఉత్పత్తుల ద్వారా మహబూబ్ నగర్ జిల్లా మరో మంచి పేరు సంపాదించడానికి ఆకాశం ఉందని అన్నారు."మహా" ఉత్పత్తులను అభివృద్ధి పరచడం, అదేవిధంగా ప్యాకింగ్, మార్కెటింగ్ పెంచటం వంటి వాటిపై మహిళా సంఘాలు దృష్టిసారించాలని, మంచి మెటీరియల్ తో ప్యాకింగ్ చేయాలని అన్నారు. సెప్టెంబర్ 30 లోపు నిర్దేశించిన ప్రాంతాలలో " మహా" స్టార్స్ ప్రారంభించాలని, ఉన్నవాటిని పటిష్టం చేయాలని అన్నారు. "మహా" ఉత్పత్తుల ప్రదర్శనలను ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధులతో ప్రారంభించాలని కలెక్టర్ తెలిపారు.
ఆగస్టు 15 న "మహా" ప్రదర్శన ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చెప్పారు.
డిఆర్డిఓ యాదయ్య , అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శారద, డి పి ఎం లు నాగమల్లిక ,సలోమీ,చెన్నయ్య,అనిల్, ఏ పీ ఎం లు,సి సి లు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.