సురక్ష పోలీసు గణపతి నిమజ్జనోత్సవం
సంస్కృతీసంప్రదాయాలకు నిలయంగా విలసిల్లుతున్న మన సమాజంలో పరస్పరం గౌరవించుకోవడం, సహకరించుకోవడమనే అత్యుత్తమ సంస్కారాలు మనకు ఆనందోత్సాహాలను అందిస్తాయని జిల్లా ఎస్.పి. రెమా రాజేశ్వరి అన్నారు. వినాయక చవితి పర్వదినం సందర్భంగా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ప్రతిష్టించిన గణపతి నిమజ్జనోత్సవ పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎస్.పి. మాట్లాడుతూ, ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కోవిడ్ నిబంధనలననుసరించి క్రమశిక్షణతో వేడుకలు జరుపుకుంటున్న తీరు మనదైన విశిష్టతను చాటుకోవడమేనని పేర్కొన్నారు. ప్రపంచంలోని ప్రతిఒక్కరూ సంతోషంగా ఉండాలనే విశాల భావముతోనే సర్వేజనా సుఖినోభవంతు అని భారతీయ సమాజం ప్రార్థిస్తూ అందరి మేలు కోరుకుంటుందని అన్నారు. జిల్లా పోలీసు పక్షాన ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో, ఆయురారోగ్యాలతో ఉండాలని నిరంతరం కోరుకుంటామని ఈసందర్భంగా ఎస్.పి. తెలిపారు. వినాయక ప్రత్యేక పూజల అనంతరం స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని ఎస్.పి. కి అందజేశారు. ఈ వేడుకలో ఎస్.పి. కుటుంబ సభ్యులు, అదనపు ఎస్.పి. ఎన్. వెంకటేశ్వర్లు, ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, అప్పల నాయుడు, రాజేశ్వర్, ఇతర అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొని, చవితి గణపతి విగ్రహాన్ని నిమజ్జనానికి తరలించారు.