సమాజానికి రక్షణ కల్పించే పోలీసు శాఖకు ప్రజల వైపునుండి లభించే అభిమానం...ఎస్.పి. రెమా రాజేశ్వరి

 సమాజానికి రక్షణ కల్పించే పోలీసు శాఖకు ప్రజల వైపునుండి లభించే అభిమానం, ప్రశంసలు ఎంతో స్ఫూర్తినిస్తాయని జిల్లా ఎస్.పి. రెమా రాజేశ్వరి అన్నారు. హైదరాబాద్ కు చెందిన హెచ్ ఫౌండేషన్ కు చెందిన సయ్యద్ ఫజల్ అలీ, ఖాజా నజీర్ లు జిల్లా పోలీసుకు అందజేసిన మాస్కులు, సానిటైజర్, మందులను ఈరోజు మధ్యాహ్నం ఎస్.పి. తన కార్యాలయంలో స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారి మాట్లాడుతూ, కరోనా మహమ్మారి ప్రపంచానికి కొత్త పాఠాలు నేర్పిందని, అదే సందర్భంలో పోలీసు శాఖకూ అనేక సవాళ్ళను రుచి చూపిందని పేర్కొన్నారు. కనిపించని శత్రువును ఎదుర్కొంటూ ప్రజలకు రక్షణ బాధ్యతలు నిర్వహించడం, కుటుంబ సభ్యులను కాపాడుకోవడంలో పోలీసు శాఖ ఎదుర్కొన్న కష్టాలను తన సిబ్బంది చెప్తుంటే, కంటనీరు ఒలికేదని అదేసమయంలో గర్వంగానూ తోచేదని ఎస్ పి. గారు వివరించారు. తమ శ్రమకు తగిన ఫలితం లభించిందని, మన జిల్లాలోని వివిధ శాఖల సమన్వయంతో కరోనా అంటువ్యాధి మరింత ప్రబలకుండా కట్టడి చేయగలిగామని తెలిపారు. ఏదేమైనా స్వీయ పరిశుభ్రత, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం వంటివి అనేకమైన అంటువ్యాధుల నుండి దూరంగా ఉంచుతాయన్న వాస్తవాన్ని ప్రతిఒక్కరూ గుర్తించి తదనుగుణంగా జీవించాలని ఎస్.పి. గారు తెలిపారు. ఇటీవల జరిగిన తుంగభద్ర నది పుష్కరాలు, ఎన్నికలు, జాతర బందోబస్తులో పాల్గొన్న పోలీసు సిబ్బందికి ఉపయోగపడే విధంగా మూడువేల మాస్కులు, సానిటైజర్, బలవర్ధకమైన మందులను హెచ్ ఫౌండేషన్ వారు అందజేయడం పట్ల ఎస్.పి. గారు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్.పి. శ్రీ ఎన్. వేంకటేశ్వర్లు, ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, అప్పల నాయుడు, హన్మప్ప తదితరులు పాల్గొన్నారు.