రాష్ట్ర రవాణా శాఖ మరో ఆరు సేవలను ఆన్‌లైన్‌ పరిధిలోకి

 రాష్ట్ర రవాణా శాఖ మరో ఆరు సేవలను ఆన్‌లైన్‌ పరిధిలోకి తెచ్చిందని ఆయా సేవల కోసం రవాణా శాఖ కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘‘ఇప్పటికే అయిదు రకాల సేవలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. తాజాగా మరో ఆరింటిని ప్రారంభించాô. డ్రైవింగ్‌ లైసెన్స్‌ పునరుద్ధరణ; డ్రైవింగ్‌ లైసెన్స్‌లో చిరునామా మార్పు; గడువు ముగిసిన లెర్నర్‌ లైసెన్స్‌ స్థానంలో నూతన లైసెన్స్‌; ప్రమాదకర పదార్థాలు రవాణా చేసే వాహనాల లైసెన్స్‌ ధ్రువీకరణ; వాహన స్థాయిని పెంచుకునేందుకు లెర్నర్‌ లైసెన్స్‌; కాలం తీరిన డ్రైవింగ్‌ లైసెన్స్‌ స్థానంలో లెర్నర్‌ లైసెన్సు కోసం ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవడం అనేవి తాజాగా ఆన్‌లైన్‌లో చేర్చిన కొత్త సేవలు. దరఖాస్తు ఆమోదం పొందితే దరఖాస్తుదారుల సెల్‌ ఫోన్‌కు ఎస్‌ఎంఎస్‌ వస్తుంది. అందులోనే ఆ లైసెన్స్‌ పత్రం పీడీఎఫ్‌కు సంబంధించిన లింకు ఉంటుంది. దాని ద్వారా ఆ లైసెన్సును డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. లైసెన్సు కార్డును దరఖాస్తుదారు చిరునామాకు పోస్టు లేదా కొరియర్‌ ద్వారా పంపుతారు. దరఖాస్తుదారులు రవాణా కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదు. ఏజెంట్లను ఆశ్రయించాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇప్పటికే అందుబాటులోకి తెచ్చిన సేవలకు ప్రజల నుంచి మంచి స్పందన రావటంతో మరిన్ని సేవలను అందుబాటులోకి తెచ్చాం. పౌరసేవలను సులభతరం చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం’’ అని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారు.

మరిన్ని సేవలకు ప్రయత్నాలు: కమిషనర్‌
ప్రస్తుతం అందుబాటులోకి తెచ్చిన సేవలతోపాటు మరికొన్ని సేవలను కూడా ఆన్‌లైన్‌లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు రవాణా శాఖ కమిషనర్‌ ఎం.ఆర్‌.ఎం.రావు తెలిపారు. ప్రస్తుతం సాంకేతిక పరీక్షలను నిర్వహిస్తున్నామన్నారు.