మహిళలు లైంగిక వేధింపులకు గురికాకుండా చూడాలి ... కలెక్టర్ ఎస్ .వెంకట రావు
పనిచేసే చోట మహిళలు లైంగిక వేధింపులకు గురికాకుండా ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు జిల్లా స్థాయి మొదలుకొని మండల స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ .వెంకట రావు అధికారులను ఆదేశించారు.
బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుండి పని చేసే చోట మహిళలపై లైంగిక వేధింపుల చట్టంపై జిల్లా అధికారులతో పాటు మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు .
2014లో మహిళల పై లైంగిక వేధింపులపై తీసుకువచ్చిన చట్టంలో పనిచేసే చోట ప్రత్యేకించి ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు సంస్థలు, కార్పొరేట్ సంస్థలలో అన్నిచోట్ల ఎవరైనా మహిళలు లైంగికంగా వేధింపులకు గురైనట్లైతే ఈ చట్టం అమలు చేయవచ్చని స్పష్టంగా ఉందని తెలిపారు. ఇందుకుగాను ముందుగా జిల్లా స్థాయిలో జిల్లా రెవెన్యూ అధికారి అధ్యక్షతన 11 మంది మహిళ సభ్యులతో జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. అదేవిధంగా మండల స్థాయిలో తాసిల్దారు, ఎంపిడిఓ, ఎంపీవో, ఎపిఓ సభ్యులుగా 11 మందితో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని, ప్రత్యేకించి ఎ పి ఓ ఆధ్వర్యంలో మహిళా సమాఖ్య లో కూడా ఒక కమిటీని ఏర్పాటు చేయాలని, ఇతర శాఖల ద వేధింపులను పరిశీలించేందుకు మరో కమిటీని ఏర్పాటు చేయాలని మండల స్థాయిలో మొత్తం 3 కమిటీలను ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. జిల్లాలోని 17 మండలాలలో 45 కమిటీలను తక్షణం ఏర్పాటు చేసి వివరాలను మెయిల్ ద్వారా పంపించాలని ఆదేశించారు. జిల్లాలో ఇప్పటివరకు 98 అంతర్గత కమిటీలు ఉన్నప్పటికీ గడిచిన మూడేళ్లలో ఏలాంటి వేధింపుల కేసులు రాలేదని అన్నారు. ప్రతి జిల్లా కార్యాలయంలో కమిటీ ఏర్పాటు చేయాలని ప్రత్యేకించి తొమ్మిది మంది మహిళా ఉద్యోగులు పైబడి ఉన్నచోట కమిటీలు తప్పనిసరిగా వేయాలని అని అన్నారు. జిల్లా పరిశ్రమల మేనేజర్ ,ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్ ఆధ్వర్యంలో మరో కమిటీని ఏర్పాటు చేసి పెద్ద పెద్ద సంస్థలు, ప్రైవేటు సంస్థలలో మహిళలపై జరిగే లైంగిక వేధింపులపై కమిటీ ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కమిటీలు ప్రతి నెల ఒకటవ తేదీన సమావేశమై మహిళలపై లైంగిక వేధింపులపై చర్చించాలని, ఒకవేళ 1వ తేదీ ప్రభుత్వ సెలవు దినం అయినట్లయితే రెండవ తేదీన సమావేశం ఏర్పాటు చేయాలని అన్నారు. మహిళలపై లైంగిక వేధింపుల చట్టం పై ఇదివరకే జిల్లాస్థాయిలో వర్క్‌షాప్‌లు నిర్వహించడం జరిగిందని, అయినప్పటికీ చట్టంలోని సూచనల్ని మరోసారి తెలుగులో అందరికీ పంపించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. మండల స్థాయిలో కూడా కళాజాత, ఫిలిమ్స్ ద్వారా అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
తెలంగాణకు హరితహారం పై కలెక్టర్ సమీక్షిస్తూ అధికారులు మొక్కలు నాటడం తో పాటు, జియో ట్యాగింగ్,మొక్కల సంరక్షణ కూడా తప్పనిసరిగా చేపట్టాలని, ఒకవేళ ఎవరైనా నిర్లక్ష్యం వహించి నట్లయితే వారి రహస్య నివేదికలో వీటిని రాయటం జరుగుతుందని అని హెచ్చరించారు.
రైతు వేదికలను కలెక్టర్ సమీక్షిస్తూ సెప్టెంబర్ 20 నాటికి ప్రతి మండలం నుండి కనీసం ఒక రైతు వేదికను పూర్తిచేసి అప్పగించాలని, సెప్టెంబర్ 30 నాటికి మొత్తం వేదికలు పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. ముఖ్యంగా తాసిల్దార్, ఎం పీ డీ వో లు, ఎంపీవోలు, వ్యవసాయ అధికారులతో మాట్లాడి వేదికల పూర్తికి చర్యలు తీసుకోవాలని అన్నారు.
ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సమీక్షిస్తూ వచ్చే సోమవారం ప్రజావాణి కార్యక్రమం పై పూర్తిస్థాయిలో సమీక్ష నిర్వహించడం జరుగుతుందని, ముఖ్యంగా ఫిర్యాదులు ఎక్కువగా ఉన్న శాఖలు తక్షణమే వాటిపై దృష్టి సారించి వాటిని పరిష్కరించాలని అన్నారు. మండల స్థాయిలో అధికారులు ఆన్లైన్ ప్రజావాణి పై దృష్టి కేంద్రీకరించడం లేదని, అందువల్ల ఎక్కువ ఫిర్యాదులు రావటం లేదని,అలా కాకుండా ప్రజలు ఫిర్యాదు చేసేందుకు కేటాయించిన ఫోన్ నెంబర్ పై మండల స్థాయిలో విస్తృత ప్రచారం కల్పించి ఎక్కువ ఫిర్యాదులు వచ్చేలా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని అన్నారు.
పల్లె ప్రకృతి వనాలకు సంబంధించి పనులను వేగవంతం చేయాలని, ముఖ్యంగా చెల్లింపులు పనుల నిర్వహణపై దృష్టి సారించాలని అన్నారు. మొత్తం 546 పల్లె ప్రకృతి వనాలకు గాను ఇప్పటివరకు 330 గ్రౌండ్ అయ్యాయని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. మున్సిపల్ కమిషనర్లు కూడా హరితహారం మొక్కల ప్లాంటింగ్ ,జియో ట్యాగింగ్ పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం తో పాటు వీది వ్యాపారులకు ఇచ్చే రుణాలపై కూడా దృష్టి కేంద్రీకరించాలని అన్నారు.
జాతీయ రహదారిపై నాటిన మొక్కల మధ్య ఎక్కడైనా దూరం ఉన్నట్లయితే తక్షణమే గుంతలు తవ్వించి మొక్కలు నాటించడంతో పాటు ట్రీ గార్డులు ర ఏర్పాటు చేయాలని సంబంధిత తాసిల్దార్ లు, ఎంపీడీవో లను కలెక్టర్ ఆదేశించారు. జాతీయ రహదారిపై నాటే మొక్కలు పెద్దగా ఉండాలని, నర్సరీ లో నుంచి కొనుగోలు చేయాలని ఆయన చెప్పారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆన్లైన్ తరగతులు, కోవిడ్ ,ఎక్సైజ్ తదితర అంశాలను కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
అదనపు కలెక్టర్ సీతారామారావు యూరియా పంపిణీ గురించి మాట్లాడుతూ తాసిల్దార్ లు యూరియా పంపిణీ ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు.
ఈ అంశంపై జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 34 వేల ఎకరాల నుండి లక్ష ఎకరాలకు వరి సాగు పెరిగినప్పటికీ యూరియా పంపిణీ లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యవసాయ అనుబంధ శాఖలు, రెవెన్యూ శాఖ కృషి చేశారని అభినందించారు. రాబోయే రెండు రోజులు మరో రెండు ర్యాకుల యూరియా జిల్లాకు రానుందని దానిని కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరఫరా చేయాలని ఆయన చెప్పారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ కు అదనపు కలెక్టర్ తేజస్, డిఆర్ఓ స్వర్ణలత, జిల్లా అధికారులు, తాసిల్దార్లు, ఎంపిడిఓలు, వ్యవసాయ అధికారులు, వివిధ శాఖల ఇంజనీరింగ్ అధికారులు, ఎంపీవోలు తదితరులు హాజరయ్యారు.