జిల్లా వ్యాప్తంగా ఆన్ లైన్ తరగతులు ప్రారంభం.... జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మహబూబ్ నగర్ జిల్లాలో మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఆన్ లైన్ తరగతులు ప్రారంభమైనట్లు జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు తెలిపారు.ఆన్ లైన్ తరగతుల పై మంగళవారం ఆయన జిల్లాలోని విద్యాశాఖ అధికారులతో తన క్యాంప్ కార్యాలయం నుండి సమీక్షించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు సకాలంలో ఆన్లైన్ తరగతులు ప్రారంభించినందుకు జిల్లాలోని ఉపాధ్యాయులను, మండల విద్యాశాఖ అధికారులను ఆయన అభినందించారు.కరోనా వైరస్ నేపథ్యంలో విద్యార్థులు తరగతులు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆన్ లైన్ ద్వారా విద్యాబోధన అందించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకుగాను టీ షాట్, నిపుణ, యాదగిరి ఛానల్ ద్వారా విద్యార్థులకు ఆన్లైన్ పాఠాలను మంగళవారం నుండి ప్రారంభించిన విషయం తెలిసిందే. జిల్లాలో ఆన్లైన్ తరగతులను ప్రతి విద్యార్థికి అందించాలన్న సంకల్పంతో జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ముందుగానే జిల్లాలోని అన్ని ఎం ఎస్ వో లు, కేబుల్ ఛానల్ ప్రతినిధులతో మాట్లాడటమే కాకుండా, విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించి జిల్లా అంతటా ఆన్లైన్ తరగతులకు విద్యార్థులందరు హాజరయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఇందుకుగాను విద్యాశాఖ అధికారులు గడచిన 3 రోజులనుండి ఇంటింటికి వెళ్లి విద్యార్థులను ముందుగానే ఆన్లైన్ తరగతులకు సంసిద్ధులను చేశారు.ప్రత్యేకించి ఆదివారం,సోమవారం జిల్లాలో ప్రతి ఉపాధ్యాయుడు వారి పరిధిలోని విద్యార్థుల ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులను ఒప్పించి టీవీలో లో ఆన్లైన్ తరగతులకు హాజరయ్యేలా వారికున్న సౌకర్యాలను,అలాగే ఒకవేళ టీవీ లేనట్లయితే ఆండ్రాయిడ్ ఫోన్ ఇతర మార్గాల ద్వారా ఆన్లైన్ తరగతులు హాజరయ్యేందుకు ఏర్పాట్లు చేశారు. తల్లిదండ్రులను ఒప్పించి విద్యార్థులను ఆన్లైన్ తరగతులకు సంసిద్ధులను చేశారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఆన్లైన్ తరగతులు ప్రారంభమయ్యాయి. ఇందుకు కృషి చేసిన డీఈవోను కూడా జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.జిల్లాలోని విద్యార్థులందరూ ఆన్లైన్ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోరారు.మంగళవారం జిల్లాలో వివిధ మాధ్యమాల ద్వారా 39171 మంది విద్యార్థులు ఆన్లైన్ తరగతులకు హాజరైనట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.ఇళ్లలోని టీవీల ద్వారా 33 491 మంది, గ్రామపంచాయతీ, స్నేహితులు, ఇతర ఇళ్లలో టివి ల ద్వారా 2149 మంది, మొబైల్ ఫోన్ ద్వారా 15 69 మంది విద్యార్థులు ఆన్లైన్ తరగతులను తిలకించారు. ఉపాధ్యాయులు 3369 మంది విద్యార్థుల తల్లిదండ్రులతో ముఖా ముఖి మాట్లాడారు. సుమారు 11 వేల మంది ఆంగ్ల, ఉర్దూ మాధ్యమ విద్యార్థులు మాత్రం తరగతులకు హాజరు కాలేదు. మంగళవారం తెలుగు మీడియం విద్యార్థులకు మాత్రమే ఆన్లైన్ తరగతులు ప్రారంభమైనట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు.