జాతీయ నులి పురుగుల నివారణ వారోత్సవం

అక్టోబర్ 5 నుండి  12 వరకు వారం రోజుల పాటు  జాతీయ నులి పురుగుల నివారణ వారోత్సవం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు తెలిపారు.
     శనివారం ఆయన జాతీయ నులి పురుగుల  నివారణ దినోత్సవం పై వైద్య ఆరోగ్య శాఖ, ఇతర సంబంధిత శాఖల అధికారులతో  వెబ్ ఎక్స్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
       ప్రతి సంవత్సరం ఒక  రోజు మాత్రమే జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించేవారమని, అయితే  కోవిడ్ దృష్ట్యా ఈ సంవత్సరం వారం రోజులపాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
   ఈ కార్యక్రమంలో భాగంగా 1నుండి 19 సంవత్సరాల లోపు వారికి అల్బెన్దజోల్ మాత్రలు వేయించడం జరుగుతుందని ఆయన తెలిపారు . 1 నుండి 2 సంవత్సరాలు లోపు పిల్లలకు సగం మాత్ర,2 నుండి 19 సంవత్సరాల  లోపు వారందరికీ ఒక మాత్ర వేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. జిల్లాలో  19 సంవత్సరాలలోపు పిల్లలు మొత్తం 278511 ఉన్నారని, వారందరికి ఆల్బెండజోల్ మాత్రలు వేసేందుకు లక్ష్యంగా నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు  .
       జాతీయ నులిపురుగుల నివారణలో భాగంగా ఆశ, అంగన్వాడీ కార్యకర్తలు ఇల్లిల్లు తిరిగి  కోవిడ్ నిబంధనలు పాటిస్తూ 1-19 సంవత్సరాల లోపు వారందరికీ నులిపురుగుల నివారణ ఆల్బెండజోల్ మాత్రలు మింగించాలని ఆయన  ఆదేశించారు. ఇందుకుగాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లాకు 3.29  లక్షల  అల్బెన్దజోల్ ట్యాబ్లెట్లను పంపినట్లు కలెక్టర్ వెల్లడించారు.
         జిల్లాలో గత సంవత్సరం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగిందని  కలెక్టర్ తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సంవత్సరం కూడా  కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని ఆయన అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో ఒక  కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు నులిపురుగుల నివారణ దినోత్సవం పై సమాచారాన్ని కంట్రోల్ రూమ్ కి తెలియజేసేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని, అంతేకాక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ,జిల్లా సంక్షేమ అధికారి, జిల్లా పంచాయతీ అధికారులు సంయుక్తంగా వెబ్ నార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సంబంధిత అధికారులు, సిబ్బందికి జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం పై తగు సూచనలు, సలహాలు ఇవ్వాలని ఆదేశించారు. అంతేకాక ఈనెల 28న జిల్లా అధికారులతో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం పై ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.

       ఈ  వీడియో కాన్ఫరెన్స్ కు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కృష్ణ, ప్రోగ్రాం అధికారి డాక్టర్ శంకర్ తో పాటు, ఇతర డాక్టర్లు, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు హాజరయ్యారు.