ఆన్ లైన్ విద్యాబోధన ను నూటికి నూరు శాతం

 జిల్లాలో  ఆన్ లైన్ విద్యాబోధన ను నూటికి నూరు శాతం మంది విద్యార్థులు వినియోగించుకొంటున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్  వెంకట రావు ఒక ప్రకటనలో తెలిపారు .

 కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు ఈ అకడమిక్ విద్య సంవత్సరం లో పాఠాలు నష్టపోకుండా ఈ నెల ఒకటి నుండి ఆన్ లైన్ ద్వారా తరగతులను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మహబూబ్నగర్ జిల్లాలో విద్యార్థులు అందరూ నూటికి నూరుశాతం ఆన్లైన్ తరగతులను హాజరయ్యేందుకు గాను ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ వివరించారు .
     ముఖ్యంగా జిల్లాలో మొత్తం 61327 మంది విద్యార్థులు ఉండగా 5310 విద్యార్థులకు టీవీలు లేవని గుర్తించి వీరిని టీవీలు ఉన్న విద్యార్థులు, ఇంటి పక్కల,అలాగే గ్రామపంచాయతీలు లో ఉన్న టి. వి ల తో అనుసంధానం చేసి ఆన్ లైన్ తరగతులకు హాజరయ్యేలా చర్యలు తీసుకున్నట్లు   తెలిపారు. ఇందుకుగాను ఉపాధ్యాయులతో పాటు, గ్రామాలలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలను పర్యవేక్షించేందుకు ఆదేశించడం జరిగిందిని ఆయన చెప్పారు. దీంతో నూటికి నూరు శాతం విద్యార్థులు అందరూ ఆన్లైన్ తరగతులు హాజరవుతున్నారని ఆయన వెల్లడించారు. ఆన్లైన్ తరగతుల విషయమై జిల్లాలోని  అన్ని స్వయం సహాయక మహిళా సంఘాలతో సమావేశాలు నిర్వహించి వారికి అవగాహన కల్పించడం జరిగిందని, ముఖ్యంగా ఆన్లైన్ తరగతుల విధానము, ఆన్లైన్ లో విద్యార్థులు పాఠాలు వినడం వల్ల పిల్లలకు కలిగే ప్రయోజనం, విద్యపట్ల అవగాహన వంటి కార్యక్రమాలను వారికి కల్పించడమే కాకుండా, ఏ జిల్లాలో లేని విధంగా మహబూబ్నగర్ జిల్లాల్లో ప్రత్యేకించి ఆన్లైన్ విద్యా విధానంపై ఒక కరపత్రాన్ని రూపొందించి తల్లిదండ్రులకు అందజేయడం జరిగిందని,ఈ కరపత్రంలో ఆన్లైన్ విద్యాబోధనకు తీసుకోవాల్సిన చర్యలు, ఏర్పాటు చేయాల్సిన టివి, ఆండ్రాయిడ్ ఫోన్, ఇతర సాధనాలు, ఒకవేళ ఇవి లేకుంటే ఇతర మార్గాల ద్వారా ఆన్లైన్ తరగతులు హాజరయ్యేందుకు సూచనలు, అంతేకాక ఆన్లైన్ విద్యా బోధన ద్వారా ఏ ఏ ఛానల్ లో ఏ పాఠ్యాంశాలు బోధిస్తారు,స్పష్టంగా  పేర్కొంటూ  కోవిడ్ నిబంధనలను పాటించే విషయాలను కూడా తెలియజేస్తూ వారికి అందజేసీ నట్లు ఆయన వెల్లడించారు. ఆన్లైన్ అంటే ఏమిటి ,ఇకపై దైనందిన జీవితంలోవారికి ఆన్లైన్ విధానం ద్వారా కలిగే ప్రయోజనాలను స్వయం సహయక మహిళా సంఘాలకు తెలియజేసినట్లు చెప్పారు.ప్రతి గ్రామంలో ఉపాధ్యాయులు 15 నుండి 20 నిమిషాలు గ్రామంలో తిరిగి తల్లిదండ్రులకు ఆన్లైన్ విద్యా విధానం గురించి అవగాహన కల్పిస్తున్నరని ఆయన తెలిపారు. అంతేకాకుండా ఆన్లైన్ విద్య తరగతులు సక్రమంగా నిర్వహించేందుకు  సెప్టెంబర్ 2న అందరూ ఏపీఎంల తో సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ వెల్లడించారు. దీంతోపాటు మండల స్థాయిలో మానిటరింగ్ కమిటీలను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని, ముఖ్యంగా తహసీల్దార్ ,ఎంపీడీఓ,ఎంపీవో,ఎం ఈవో, మున్సిపల్ కమిషనర్లు వారివారి పరిధిలో పంచాయతీ కార్యదర్శులు, విఆర్వో ల ను ఆన్ లైన్ తరగతుల విజయవంతానికి పర్యవేక్షణ చేస్తున్నారని,గ్రామాలలో తిరిగి  తల్లిదండ్రులకు ఆన్లైన్ తరగతుల పై అవగాహన కల్పించి వారి పిల్లలు తరగతులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోన్నట్లు తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు ఆన్లైన్ తరగతులు వింటున్నారో లేదో పర్యవేక్షించాలని ప్రత్యేకించి హెడ్మాస్టర్ల్, వీఆర్వో, పంచాయతీ కార్యదర్శుల ద్వారా గ్రామాలలో పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. ఆన్లైన్ తరగతులు  సమయంలో తప్పనిసరిగా విద్యార్థులు మాస్కు ధరించి, సామాజిక దూరం పాటించేలా కృషి చేయాలని వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి, హెడ్మాస్టర్లను ఆదేశించినట్లు చెప్పారు. అంతేకాక మున్సిపల్ ,గ్రామస్థాయిలో పాఠశాలలో పారిశుధ్య పనులు సక్రమంగా నిర్వహించాలని కూడా తెలియజేసినట్లు ఆయన వెల్లడించారు. ప్రత్యేకించి 100% పిల్లలు జిల్లాలో ఆన్లైన్ తరగతులకు హాజరయ్యేందుకు అన్నీ సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ వెల్లడించారు. టీవీ లేని పిల్లలకు ఇతర పిల్లలతో అనుసంధానం చేయటం, ప్రతిరోజు వారు తరగతులు హాజరయ్యేలా చూడడం,  విద్యార్థుల హాజరును పర్యవేక్షించడం, ప్రతిరోజు ఆన్లైన్ తరగతులు పై విద్యాశాఖ అధికారుల ద్వారా నివేదికలు సేకరిస్తున్నట్లు వెల్లడించారు.