మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి – టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఇజాజ్ ఉద్దీన్

మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

– టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఇజాజ్ ఉద్దీన్

మహబూబ్‌నగర్, జూన్ 26: మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఇజాజ్ ఉద్దీన్ పిలుపునిచ్చారు.

జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకి, ఐపీఎస్ ఆదేశాల మేరకు మాదకద్రవ్యాల నివారణ వారోత్సవాల్లో భాగంగా మహబూబ్‌నగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ వొకేషనల్ బాలుర కళాశాలలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ ఇజాజ్ ఉద్దీన్ మాట్లాడుతూ, మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తిగత జీవితంతో పాటు కుటుంబం, సమాజం, దేశ భవిష్యత్తుపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు విద్య, క్రీడలు, సృజనాత్మక కార్యక్రమాలపై దృష్టి సారించి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు.

అనంతరం మాదకద్రవ్యాల నివారణపై అవగాహన పోస్టర్‌ను విడుదల చేసి, విద్యార్థులతో మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని, సమాజంలో ఇతరులకు కూడా అవగాహన కల్పిస్తామని ప్రతిజ్ఞ చేయించారు.

మాదకద్రవ్యాల అలవాటు ఆరోగ్యాన్ని దెబ్బతీసి నేరాలకు దారితీసే ప్రమాదం ఉందని, ఎవరైనా మాదకద్రవ్యాల విక్రయం లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, పోలీసు సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు